అయిదేళ్ళ అందలానికే...
అయ్యవార్ల తందనాలు
గద్దెనందుకోవడానికే...
వంగివంగి వందనాలు
నోటికిహద్దులేని
వాగ్ధానాలు,
చేతికెముకేలేని
బహుమానాలు,
పదవిని చేపట్టేదాకా...
కొదవేముందీ..కోతలకు,
అనుకొన్నదిసాగేవరకు
అరచేత్లో స్వర్గంచూపెడతారు
ఆకాశంలోచుక్కలనైనా..
నేలకిదించేస్తారు
తీరా...అందినాక
మనకు పట్టపగలే
చుక్కలు చూపిస్తారు
ఓట్ల భిక్షాటనలో
అడుగడుగునా...హైడ్రామాలు
ఆపై...అమాయకజనానికి
పెడతారు..పంగనామాలు
పర్యవేక్షణలు,
పాదయాత్రలంటూ..
పల్లెపల్లెకూ ...పలకరింపులు
పదేపదే..పడతారు
ప్రజలకు నీరాజనాలు
భయమేల...మీకంటూ
అందరికీ..అభయంఇస్తారు
వట్టిమాటలను కూడా
గట్టిమాటల్లాగే...
నొక్కినొక్కిచెప్తారు..
నాటకాలు,బూటకాలలో
మహానటులను తలపిస్తారు
అడుగడుగునా...
ఆత్మీయరాగమే
ఆలపిస్తారు...
అనుకొన్నది... దక్కిందో
కిక్కురుమనకుంటారు..
ఏవోదిక్కులు చూస్తుంటారు
ఇవీ..మన నాయకులనైజాలు
ఇప్పటికైనా...తెలుసుకోండి
నిజానిజాలు,
ఆసన్నమయ్యింది
అనువైన సమయం
అవినీతిరాజ్యమేలుతున్న
నేటి ప్రజాస్వామ్య వ్యవస్ధలో
నోట్ల వ్యామోహంలో
ఓట్లనమ్ముకోవద్దు
మద్యంమత్తుల్లో...
నాయకులనెన్నుకోవద్దు
మీతలకు మీరే కొరివి
పెట్టుకోవద్దు..
కోరి...కష్టాలను కొనితెచ్చుకోవద్దు
గోముఖవ్యాఘ్రాలన్నమ్మి
గొర్రెల్లా...ఓటేయద్దు
ఒక్కపూటవిందుకోసం
తాగినంతమందుకోసం
మత్తెక్కి మీఓటును
ఎటోవైపు విసిరేస్తే ..
అంతా...అయిపోయాక
అగోరించక తప్పదు
ఐదేళ్ళూ...అరకొరబ్రతుకులతో
అల్లాడకా తప్పదు
'ఓటు'అనే మహత్తరశక్తిని
అపహాస్యంచేయద్దు
అపాత్రదానం అసలేచెయ్యొద్దు
అందులకే....ఆలోచించండి
అర్హులకే పట్టంకట్టండి
ఆదమరచి..హాయిగా
బ్రతుకును కొనసాగించండి
చేయిచేయికలపండి
భరతఖ్యాతి నిలపండి
ప్రతిజ్ఞ చేయండి
ప్రజాస్వామ్యం పరువునిలబెడతామని.
శ్రీమణి
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
27, సెప్టెంబర్ 2018, గురువారం
*మేలుకో..మేలుకై*
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి