పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, నవంబర్ 2017, మంగళవారం

కల"వరం"

"కల "వరం

అమ్మ గర్భం నుండి భూమ్మీద పడగానేమొదలైంది అడుగడుగునా వడ్డింపు ప్రక్రియ,పురుడుపోసినందుకు
చేన్తాడంత ఆసుపత్రి బిల్లు
అదిచూసి నాన్న గుండెజల్లు
అలామొదలయింది బిల్లుల పరంపర..
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది 
అవసరాల ధర ఆకాశంలో చూసి ... 
ఖర్చు లేదుకదా .. కమ్మని  కల కందామంటే 
కరెంటుబిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది 
నిజమే కదా .. 
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు 
కళ్ళు మూస్తే
 తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల
అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో
తల బ్రద్దలవుతుంటే ...  నిద్దరెలా వస్తుంది 
 వెన్నెల పట్టపగల్లా ఉన్నా.. 
 పట్టపగ్గాల్లేని ఆలోచనలతో      పట్టపగలే  చుక్కలు చూపిస్తుంటే ... నిద్దరెలా వస్తుంది.
అదేంటో  చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ
ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి
అమ్మ చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు బావురుమనకుంటే చాలు 
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది 
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్ 
కానీ  ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు 
"వెల"పెరిగిన వేగంతో నెలజీతం పెరగదేం?
నిత్యావసరాలు నిచ్చెనలెక్కేస్తున్నయ్  నల్లఖజానాలేమో
నింగినంటుకొన్నయ్.
మంచంలేచిన మొదలు లంఛం లాంఛనమాయె,
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవితంలోమాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది . 
నేటి మద్యతరగతి భర్తకి
భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే 
కన్నీరే అడ్డు వస్తుంది
తన కనీస అవసరాలు కూడా తీర్చలేక 
ఆనాడు ఎంతమంది పిల్లల్నికన్నా  అంత ఆనందంగా పెంచగల్గేవారు
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది 
అసలు  మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కాలని ఆశవుండేది..ఆశ మాటెలావున్నా
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది 
భార్య కూరల్లో పోపు మానేసినా ... 
భర్త స్నానంలో సోపు మానేసినా .. 
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు 
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది 
నిత్యం జారే కన్నీళ్ళే  .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది 
కడుపుమంటే కడుపు నింపుతుంటే 
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే 
రెప్ప పడక కన్నులు  
లభో దిభో మంటుంటే
నిద్దరెలా వస్తుంది 
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే 
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక 
నగుపాటు పాలవుతుంటే తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే
చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప
మతి లేక తప్పు చేసిన వాడికంటే ,
గతి లేక చేసిన వడ్డీఅప్పే
పెద్ద శిక్ష .  
ఎలా ఎలా బ్రతకాలి అని  ప్రశ్నించుకు పోతుంటే 
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే  వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని 
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ 
కల అయినా వస్తే బావుణ్ణు .  కడుపునిండా తిన్నామని 
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని 
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని 
కలైనా వస్తే బావుణ్ణు 
"కల"వరమై వస్తే బావుణ్ణు "కలవరం"తగ్గడానికి  
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ 
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి 
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
 నిత్య క్రృత్యమయిపోయే
మద్యతరగతి మానవుడికి
ఈ కలచి వేసే మధ్యతరగతి      బ్రతుకులపై 
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ...  సందేహమే  ?????????
 సాలిపల్లిమంగామణి@శ్రీమణి
                                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి