పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

4, జనవరి 2021, సోమవారం

*నీ తలపుల సందోహమే*

*నీ తలపుల సందోహమే*

మందానిలము స్పృశించి
అరవిరిసిన మందారంలా
నీ మందస్మితమున మైమరచి
మనోజ్ఞమాయెను
నామానసతీరం
ఆ తూరుపు రాగం మీటిన
సిందూరంలా
నీ నిట్టూర్పు రాగం మాటున
మంత్రముగ్ధనైతి
నా ఊహల తావులన్నీ
నీ నులివెచ్చని ఊపిరులై
మూసివున్న నా కనురెప్పలపై
మధురమాయె కదా
నీ అధరసంతకం
విరుల పరిమళాలు సైతం
వెదజల్లగ వెరచెనేమో..
ఎదఝల్లను నీ తలపుల
సుమగంధాలకు తాళలేక,
వివశనైతి ప్రభూ నీ ఎదవాకిట
విరహగీతి పాడుతూ
మదనమైతి ప్రియసఖుడా
మాటరాక మధువనిలో
నీ మధురోహల పరమౌతూ
సందేహం లేదు ప్రియా
ఇది నీతలపుల సందోహం
ఈ సఖి మోహం సాంతం
సమ్మోహన మురళీ...
సదా నీ పాదాక్రాంతం.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

23, డిసెంబర్ 2020, బుధవారం

తిన్నావో లేదో..

*తిన్నావో లేదో*

తిన్నావో లేదో
మాకు తిండిమెతుకు
లివ్వాలన్న ఆరాటంలో
కునుకైనా తీసావో లేదో
చినుకు రాలుతుందో
లేదోనని ఆలోచనలో
ఉన్నారా సామి ! 
అవనిపై నీకన్నా
మనసున్న ఆసామి 
వెలగట్టగ తరమా ఏమి
నీ భుజముల కష్టాన్ని
అమ్మలాంటి నీ సేవకు 
జన్మంతా ఋణపడాలి
ఆకాశమంటి నీ త్యాగానికి 
జగమంతా ప్రణమిల్లాలి‌
రైతే రాజై విలసిల్లేటి
మునుపటి రోజులు
కానుక కావాలి
వెతలే తాకని,వేదన తెలియని
వేకువలే ఇకపై తప్పక ఉదయించాలి
అపుడే కదా అసలుసిసలు
రైతుదినోత్సవం
అన్నదాత నవ్వితేనేగా
అవనికి కోటి దీపోత్సవం.
(రైతు దినోత్సవం సందర్భంగా)
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

ఇచ్చి పడేస్తుందిగా

ఇచ్చి పడేస్తుందిగా

ఏమంటారింతకీ..
మళ్ళొస్తుందా ఆ హంతకీ
ఇంతింతై వటుడింతై
మహామహా మహమ్మారి 
మళ్ళొస్తుందా మన చెంతకీ
అంతమైతే తప్పదా
అంతటితో ఆగదా..
కరోనాయో‌....
ఘరానాయో...
ఏదో ఒక రాయి
పళ్ళైతే రాలుతున్నాయి
ఏదో మన పిచ్చిగానీ
ఇచ్చిపడేస్తుందిగా...
ఇంత తప్పిదానికి
రెండింతల పరిహారం
తప్పులు చేసినప్పుడల్లా
తప్పించుకు తిరిగేసామానుకొన్నాం
విపరీతమైన విజ్ఞానంతో
విశ్వాన్నే తిరగేసామనుకొన్నాం
ప్రకృతితో పనిగట్టుకు పరాచికాలాడాం
పారనీయలేదుగా పాచికలిక
నిప్పుతోనే చెలగాటం
నిలువునా కాలిపోతున్నాం
నిలువరించలేని ప్రాణసంకటం
ఇప్పటికీ
మానవాళి ఖాతాలో 
కుప్పలు తెప్పలుగా పాపం
మనకు నివాళి సిద్ధం
చేసింది ప్రకృతి ప్రతీకారశాపం
మెలుకోక తప్పదు మరి
మేలు కోరి తప్పనిసరి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

26, అక్టోబర్ 2020, సోమవారం

కవనకిరణాలు తెలుగు సాహితీ సమాఖ్య (ముంబాయి)వారి నుండి కవనకిరణం బిరుదు సత్కారపత్రం అందుకొన్నశుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ..🙏🌹🍃🌹🍃🌹🍃🌹🙏 *శ్రీమణి*

కవనకిరణాలు తెలుగు సాహితీ సమాఖ్య (ముంబాయి)వారి నుండి కవనకిరణం బిరుదు సత్కారపత్రం అందుకొన్న
శుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ..
🙏🌹🍃🌹🍃🌹🍃🌹🙏
                     *శ్రీమణి*

విజయదశమి శుభవేళసాహితీవేత్తల సమూహంవారు నిర్వహించిన కవితల పోటీలలో ద్వితీయబహుమతి సాధించి, ప్రశంసాపత్రం అందుకొన్న శుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.. *శ్రీమణి*

విజయదశమి శుభవేళ
సాహితీవేత్తల సమూహం
వారు నిర్వహించిన కవితల పోటీలలో  ద్వితీయబహుమతి 
సాధించి, ప్రశంసాపత్రం అందుకొన్న శుభతరుణం 
మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ..
                  *శ్రీమణి*

17, ఆగస్టు 2020, సోమవారం

కర్నాటక తెలుగు రచయితల సమాఖ్య (బెంగళూరు)వారునిర్వహించిన అంతర్జాల కవిసమ్మేళనంలో

కర్నాటక తెలుగు రచయితల
సమాఖ్య (బెంగళూరు)వారు
నిర్వహించిన అంతర్జాల కవిసమ్మేళనంలో
(21 శతాబ్దంలో స్వాతంత్ర్యభారతం
అనే అంశంపై)
పాల్గొని కవితాపఠనంచేసినందుకు
పొందిన ప్రశంసా పత్రం.
🌺🙏🙏🙏🙏🌺...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

10, ఆగస్టు 2020, సోమవారం

*మల్లినాథసూరి కళాపీఠం* (ఏడుపాయల,మెదక్ జిల్లా' తెలంగాణా రాష్ట్రం)వారి సాహితీ సంస్థానంలోపలు అంశాలలో విశేషమైన కృషితో105 రచనలు చేసిన సందర్భంగావారు నా సాహితీసేవను గుర్తించి*కవిచక్ర* అనే విశిష్టమైన బిరుదు ప్రధానంచేసి (ఆన్లైన్లో )సత్కరించిన శుభతరుణంమీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ*......సాలిపల్లి మంగామణి (శ్రీమణి).*

*మల్లినాథసూరి కళాపీఠం* (ఏడుపాయల,మెదక్ జిల్లా' 
తెలంగాణా రాష్ట్రం)
వారి సాహితీ సంస్థానంలో
పలు అంశాలలో విశేషమైన కృషితో
105 రచనలు చేసిన సందర్భంగా
వారు నా సాహితీసేవను గుర్తించి
*కవిచక్ర* అనే విశిష్టమైన బిరుదు
 ప్రధానంచేసి (ఆన్లైన్లో )
సత్కరించిన శుభతరుణం
మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ
*......సాలిపల్లి మంగామణి (శ్రీమణి).*

24, జులై 2020, శుక్రవారం

మహాభిజ్ఞుడు...గుర్రంజాషువా

అతడొక మహా మనీషి
అతడొక మహోన్నత శక్తి
అతడొక మానవతామూర్తి
అతడొక నవ చైతన్య స్ఫూర్తి 
అఖండ ఆంధ్రావని చరిత్రలో
అతడొక మహోజ్వల సాహితీ మూర్తి
అతడొక నవయుగ కవి చక్రవర్తి

అభివర్ణించ గలమా...
అక్షరాలతో అక్కజాలు సృష్టించి
అగ్రవర్ణాలలో అలజడి పుట్టించిన
ఆ అభ్యుదయ కవి దిగ్గజాన్ని 
అక్షరాలు చాలునా ఆ మహాభిజ్ఞుని 
సాహితీ ప్రజ్ఞా ప్రాభవాన్ని ప్రస్తుతించ
అక్షరాలు సరిపోవునా విశ్వవిఖ్యాతమౌ
ఆ "విశ్వనరుని"ఘనకీర్తి గణుతించ
పదివేల మాటలు చాలునా.. 
ఆ పద్య కవీంద్రుని
పద కౌశలాన్ని సన్నుతించ

ఏమని పొగడ గలము
ఎల్లలు దాటిన అద్వితీయ 
సాహితీ సుమ సౌరభాన్ని
ఎంతని కొనియాడగలము
ఆ విశ్వకవి సామ్రాట్టు
కవన ప్రాశస్త్యాన్ని
సమ సమాజ స్ధాపనకై
సాంఘిక ప్రక్షాళనకై
కుల వివక్ష కూకటి వేళ్ళ
పెకలించగ తన కల కరవాలమును ఝుళిపించి
కవన రంగమున దూకె
కవి నారసింహుడై
వెలివాడల బ్రతుకుల్లో
తొలి వెలుగు జాడల ప్రసరించగ

అక్షరాగ్నిని ప్రజ్వలింప జేసిన
ప్రఛండ భాస్కరుండతడు
పంచముడెవరని
పంచభూతాలసాక్షిగా ప్రశ్నించి
కడజాతి కడగండ్ల కడదేర్చ
కబురంపె "గబ్బిలం"తో రాయభారము కాశినాధునికి కడు చిత్రంగా..
తన ఖండ కావ్య మందు
సమత మమత మానవతలే 
తన కవితా పాదాలుగా అభ్యుదయ 
సాహిత్య సేద్య మొనరించె

రసరమ్య ప్రణయామృతాన్నైనా
సాంఘిక దురాగతాన్నైనా
పెల్లుబికిన కన్నీటినైనా
వెల్లి విరిసిన అనుభూతి నైనా
సాహితీ ప్రస్ధానంలో
ఆతను స్పృశియించని
అంశమే లేదంటే అతిశయోక్తి కాదేమో
అట్టడుగు జీవితాలే
పద్య శిల్పాలుగా

మండుతున్న నిరుపేద గుండెలే
ఖండ కావ్యాలుగా  అమృత గుళికనూ, నిప్పు కణికనూ
తన కలాన ఇముడ్చుకొని
ఒకపరి .......
కాల్పనికతతో కలలో విహరింప చేసినా
తదుపరి....
వాస్తవికతను వాడి,వేడిగా వడ్డించినా
ప్రకృతిలో పరమాణువు సైతం
తన కలాన కవనం గావించి
ఒక కవీంద్రుని ఆత్మ నివేదనాన్ని
ఫిరదౌసిలో హృద్యంగా ఆవిష్కరించి

నవ మాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి యంటూ
అనుభవించు కొలంది నినుమడించుచు మరంధము జాలువారు
చైతన్య ఫలమంటూ 
శిశువును అభివర్ణించి
తేలిక గడ్డిపోచలను తెచ్చి
రచించితి వీవు 
తూగుటుయ్యేల
గృహంబు మానవులకేరికి సాధ్యము కాదనుచు,
గిజిగాని నేర్పరితనాన్ని, కొనియాడి ,అఖండ గౌతమీ నది అందాలను రమ్యంగా అక్షరీకరించి
అఖండ ఆంధ్రావనికీ
తన ఖండ కావ్యాల కలఖండలిచ్చిన
విశ్వకవి సామ్రాట్టు

అగ్రవర్ణాలకే పరిమితమైన
సాహిత్యాన్ని 
మొట్టమొదటగా
అట్టడుగు జీవితాలకు పరిచయంచేసి
కరుణ రసావిష్కరణం చేసిన
కరుణార్ధ్రమూర్తి

వడగాల్పు నా జీవితమైతే
వెన్నెల నా కవిత్వమని
ఛీత్కారాలు పొందిన
తావుల్లోనే  తన ధిక్కార స్వరంతో
సాహిత్య
సమరం గావించి
సత్కారమందు కొన్న
సత్కవి వరేణ్యులు

మన జాషువా నాటిన
అభ్యుదయ సాహితీ వనంలో
నే గడ్డి పూవయినను చాలు
ఆ కవివరేణ్యుని సాహిత్య బాటలో
నే ఇసుక రేణువయిననూ  చాలు
ఆ అభీకుని కలం విదిల్చిన సిరా బొట్టునయిననూ... చాలు
ఆ మానవీయుని కలాన 
జాలువారిన కవనంలో నేనొక 
ఆక్షరమయిననూ చాలు
ఆ దార్శనికుని కావ్య సంద్రంలో
చిన్ని అలనయినా చాలు

కవి తలపెట్టిన 
సమ సమాజ స్ధాపన మహాయజ్ఞం కొనసాగించుటకై
మన ఉడత.  సాయమందిద్దాం
చిరు కవితాబాణం సంధిద్దాం
అదే మనమహనీయునికిచ్చే
మహత్తర నివాళి...

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
*విశాఖ పట్నం*

22, జులై 2020, బుధవారం

సాహిత్యపునిధి

*సాహిత్యపునిధి*

మహాకవి దాశరథి
ఆంధ్ర కవితా సారథి
అభ్యుదయ కవితా వారధి
అతడొక అక్షరాల నిధి
అచ్చతెలుగు సాహిత్యపు పెన్నిధి
అతడే మన మహాకవి దాశరథి
ఎడతెగనిది వారి కీర్తి
వాడి తగ్గనిది వారి కలం శక్తి
పద్యమే పదునైన ఆయుధంగా
ఉద్యమమే ఊపిరిగా
నిజాంపాలనపై నిప్పులు
కురిపించిన కవనధీరుడు
ఉపాధ్యాయుడు
ఉద్యమకారుడు
నిజాం నవాబుల
పైశాచిక రాజరికపుకాలంలో
కదం తొక్కి దొరతనానికి
ఎదురొడ్డి పోరాడిన కలమది
కారాగారమున సైతం ధారాళంగా
అభ్యుదయ రచనలు చేసి కలంసత్తా చూపించిన ‌కవి దిగ్గజం
వారి అక్షరాలు దొరతనానికి
ఎదురొడ్డి పోరాడిన వాడియైన శరాలు
వారి పదాలు నిజాం నవాబుల
దాష్టీకాన్ని నినదించే
నిప్పులాంటి శపధాలు
వారి కవిత్వం మహాసముద్రం
వారి కలం చైతన్యం రగిలించే
ప్రగతి రథచక్రం
అతడి కలం అజరామరం
అతని రచనలు ఆంధ్రజాతికి
కరతలామలకం
అతడు తెలుగులమ్మ నుదుటున
మెరిసిన ఎర్రని సాహితీ తిలకం.
(శ్రీ దాశరథి కృష్ణమాచార్య వారి 96వ జయంతి సందర్భంగా మహతీ సాహితీ కవిసంగమం వారి దాశరథి ఇ-కవితా సంకలనము కొరకు రాసిన కవిత )
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

16, జులై 2020, గురువారం

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కవి సమ్మేళనంలో (అంతర్జాల వేదికలో) పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న శుభతరుణం.🌹🍃🌹 ... *శ్రీమణి*

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కవి సమ్మేళనంలో (అంతర్జాల వేదికలో) పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న శుభతరుణం.🌹🍃🌹
                ... *శ్రీమణి*